అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ఆయన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నవంబరు నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్దేశిత గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచాలని తెలిపారు. నవంబరు నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. మీ పెట్టుబడులకు మాది భరోసా అనే నినాదంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి సమ్మిట్ ఏర్పాట్లపై కసరత్తు చేయాలన్నారు. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఆ స్థాయిలో సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కేవలం వ్యాపార సదస్సు మాత్రమే కాదని, తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే చారిత్రక వేదికగా నిలుస్తుందని సీఎం అన్నారు. అందుకే సమ్మిట్ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఒక కమిటీని నియమించుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించడానికి ముందు ఇబ్రహీం పట్నంలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవనంలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి, కమిషనర్ తరుణ్ జోషికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సందర్శించిన ఆయన, ఎఫ్ సీ డీఏ కార్యాలయ ఆవరణలో (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంపస్ నమూనాను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

