దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామపంచాయతీ చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ప్లాస్టిక్ రహిత గ్రామ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. కమ్యూనిటీల వారీగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు కొనుగోలు చేసి, వివిధ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో వాటిని వినియోగించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తద్వారా పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని తగ్గిస్తున్నట్లు వివరించారు. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా గ్రామపంచాయతీకి తీసుకువచ్చి అందజేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామపంచాయతీకి తీసుకువచ్చి అందజేసే వారికి ప్రోత్సాహకంగా స్టీల్ వాటర్ బాటిళ్లను అందిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా, ఐకేపీ సంఘ భవనంలో కమ్యూనిటీ కార్యక్రమాల కోసం నిత్య వినియోగానికి ఒక దాత 300 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కెనరా బ్యాంక్ ద్వారా ఆరు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద మొత్తం కోటి రూపాయల రుణాలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా రుణాలకు సంబంధించిన చెక్కులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాభివృద్ధి కార్యకలాపాలను చేపట్టి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. గొట్టిముక్కుల గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలు అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ఒక్కరి బాధ్యత కాదని, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీరు, నేల, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమంగా తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్లాస్టిక్‌కు నో చెప్పండి వ్యాధులను నివారించండి.. నీరు, నేల, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గొట్టిముక్కుల గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, మరింత మందిని భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై యూపీఎస్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించే స్కిట్‌ను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనను జిల్లా కలెక్టర్, అధికారులు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి ప్రతి ఇంటికి జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా పునర్వినియోగ జూట్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డీఆర్డీఏ పీడీ దామోదర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, డీఎల్పీఓ శ్రీనివాస్, కెనరా బ్యాంక్ అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












