భారతీయ హజ్ యాత్రికుల సంక్షేమానికి సౌదీ అరేబియా అందిస్తున్న సహకారాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించారు. 2027 హజ్ యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న ఆరో హజ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆరో హజ్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి, హజ్ శాఖ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అఫ్జల్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌదీ హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్‌తో సమావేశమయ్యారు.
భారతీయ యాత్రికులకు సౌదీ సహకారం
భారతీయ హజ్ యాత్రికుల సంక్షేమానికి సౌదీ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి కిరణ్ రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. 2027 హజ్ యాత్ర విజయవంతం కావడానికి ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, వారి భద్రత, ప్రయాణ ఏర్పాట్లు, వసతి వంటి అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి.
