అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించకపోవడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. సరిహద్దు భద్రత, చైనాతో సంబంధాలు, దేశ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
భారత్టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా సైనికులతో ఘర్షణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో సైనిక సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చైనా సరిహద్దు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాంతమని ఐటీబీపీ అధిపతి పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. గల్వాన్ తరహా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించడం, డ్రోన్ విభాగాలను బలోపేతం చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించినట్లు సమాచారం.
ప్రధాని మౌనంపై జైరాం రమేశ్ ప్రశ్నలు
ఈ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ, సరిహద్దులో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండటం ఆందోళనకరమని విమర్శించారు. చైనాకు కేంద్రం రాయితీలు ఇస్తోందని ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారత సైనికుల గస్తీకి ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

