ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి భారత్, ఉజ్బెకిస్థాన్ తమ పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. జాతీయ, ప్రాంతీయ భద్రతకు ముప్పులను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో ఇరు దేశాల ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యాచరణ బృందం పదో సమావేశం జరిగింది.
ఈ కీలక సమావేశానికి భారత విదేశాంగ శాఖలో ఉగ్రవాద నిరోధక విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్, ఉజ్బెకిస్థాన్ విదేశాంగ శాఖలో దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలతో సహకార వ్యవహారాల విభాగం అధిపతి పిరిమ్కులోవ్ గులొమ్జోన్ షోడ్మోన్కులోవిచ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉగ్రవాద ముప్పులపై సమగ్ర చర్చ
ప్రపంచవ్యాప్తంగా, అలాగే తమ తమ ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థల నుంచి ఎదురవుతున్న ముప్పులపై ఇరు దేశాల ప్రతినిధులు లోతుగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో తలెత్తే సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తీవ్రవాద భావజాలం, రాడికలైజేషన్‌ను అడ్డుకోవడం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే మార్గాలను నియంత్రించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.












