ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల విదేశీ పర్యటనల పూర్తి రికార్డులను వెల్లడించాలన్న కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం జాతీయ భద్రతకు, ప్రధాని భద్రతకు ముప్పు కలిగించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.
రిటైర్డ్ నేవీ అధికారి కమోడోర్ లోకేశ్ బాత్రా 2015లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. 2001 నుంచి 2005 మధ్య కాలంలో మోదీ, మన్మోహన్ సింగ్‌లు భారత వైమానిక దళ విమానాల్లో చేసిన విదేశీ పర్యటనల వివరాలను ఆయన కోరారు. వైమానిక దళం కొన్ని వివరాలు అందించినప్పటికీ, ప్రత్యేక విమాన ప్రయాణ రికార్డుల పూర్తి ప్రతులను ఇవ్వడానికి నిరాకరించింది. అందులో విమానం, సిబ్బంది, ప్రయాణికులు, ప్రధాని భద్రతా బృందానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సీఐసీ ఆదేశం, హైకోర్టు తీర్పు
2020లో సీఐసీ, కొన్ని వివరాలను వెల్లడించాలని వైమానిక దళాన్ని ఆదేశించింది. భద్రతా సిబ్బంది పేర్లు, గుర్తింపు వివరాలు తొలగించిన తర్వాత మిగిలిన రికార్డులను అందించాలని సూచించింది. అయితే, ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ వైమానిక దళం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ అమిత్ మహాజన్ విచారణ అనంతరం సీఐసీ ఆదేశాన్ని రద్దు చేశారు. భద్రతా సిబ్బంది పేర్లను తొలగించినా, మిగతా సమాచారంతో భద్రతా ఏర్పాట్ల గురించి కీలక విషయాలను అంచనా వేసే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.












