తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం, కేసును పొరుగు రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన పాల ఉత్పత్తుల వ్యాపారి, మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ఈ కేసుపై పదేపదే ప్రకటనలు చేస్తుండటంతో నిష్పక్షపాత విచారణకు అనుకూలమైన వాతావరణం లేదని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతో తమ క్లయింట్‌కు న్యాయమైన విచారణ జరిగే విషయంలో ఆందోళన ఉందని వాదించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించలేదని చెబుతున్నప్పటికీ, రాజకీయ నాయకులు ఈ అంశంపై ప్రకటనలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందినవారని, భాషాపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో విచారణ కొనసాగితే తమ క్లయింట్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని వాదించిన ఆయన, అందువల్ల కేసును ఏదైనా పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.

