ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టికి సంబంధించిన ఓ కారు ప్రమాద ఘటన దాదాపు 40 ఏళ్ల తర్వాత తాజాగా వెలుగులోకి వచ్చింది. నటుడు, రచయిత వీకే శ్రీరామన్ తన ఫేస్బుక్ పోస్టులో ఈ సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఊటీ నుంచి కోయంబత్తూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
పవిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్తరం సినిమా షూటింగ్ సమయంలో మమ్ముట్టి, శ్రీరామన్ కలిసి ఊటీ నుంచి కోయంబత్తూరుకు కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో మమ్ముట్టి తన కాంటెస్సా కారును నడుపుతుండగా, ఓ కాన్వెంట్ పాఠశాల సమీపంలో రోడ్డు దాటుతూ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన పదేళ్ల బాలుడిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరామన్ తల కారు అద్దానికి బలంగా తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే మమ్ముట్టి కారు దిగి బాలుడి వద్దకు వెళ్లారు. బాలుడి జేబులో ఉన్న రెండు క్రికెట్ బంతులు దెబ్బ తీవ్రతను తగ్గించాయని, అతడు రోడ్డు పక్కన ఉన్న కాలువపై తీగల పొదల్లో పడటంతో ఎలాంటి గాయాలు కాలేదని పాఠశాల భద్రతా సిబ్బంది వివరించారు. బాలుడు క్షేమంగా ఉండటంతో అక్కడి వారు మమ్ముట్టిని అభినందించారు. అయితే, స్థానికులు తనను డ్రైవర్‌గా భావించి మందలిస్తారేమోనని కోయంబత్తూరు చేరుకునే వరకు భయపడుతూనే ఉన్నానని శ్రీరామన్ తన పోస్టులో సరదాగా వెల్లడించారు. ఈ పాత సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి




