వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు వంటి పదవులకు మాదిగలు పనికిరారా అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంగా షబ్బీర్ అలీ సొసైటీ చైర్మన్ పదవిలో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ఎమ్మార్పీఎస్ నేతృత్వంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, షబ్బీర్ అలీని హెచ్చరిస్తున్నామని తెలిపారు. మాదిగలను చిన్నచూపు చూడటం సరికాదని బట్ట వెంకట్ రాములు అన్నారు. సమానత్వం, సమన్యాయం చేయాల్సిన పెద్దలు న్యాయం పాటించాలని కోరారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సొసైటీ చైర్మన్ పదవుల్లో మాదిగలకు కనీస ప్రాధాన్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణ అమలు చేసి, కాంగ్రెస్ పార్టీ మాకు గొప్ప అవకాశం కల్పించిందని భావించామని, కానీ నామినేటెడ్ పోస్టుల వద్ద మాకు ప్రాధాన్యత లేకుండా పోయిందని తెలిపారు. వర్గీకరణ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా భావించి, ఇప్పటిదాకా ఓపిక పట్టామని, ఇకనైనా మాదిగలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తి గారి లక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బానపురం లావణ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సత్తి గారి బుజ్జమ్మ, ధ్యానం భూపతి రవి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

