అస్సాంలోని గువాహటిలో గల అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో కలుషిత నీటి వాడకం కలకలం రేపింది. హాస్టల్ నీటి ట్యాంకులో కోతి మృతదేహం కనిపించడంతో 54 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం అందిస్తున్నారు.
కాలేజీలోని ఏడో నంబర్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు నీటి నుంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశారు. దుర్గాపూజ సెలవుల అనంతరం హాస్టల్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచే నీటిలో వింత వాసన వస్తున్నట్లు గుర్తించామని విద్యార్థులు తెలిపారు. మొదట కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆహారం కారణమై ఉండవచ్చని అనుమానించారు. అయితే, మరింత మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో నీటి ట్యాంకులను పరిశీలించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ క్రమంలో హాస్టల్ ఓవర్‌హెడ్ నీటి ట్యాంకును తనిఖీ చేయగా, అందులో కుళ్లిపోయిన కోతి మృతదేహం కనిపించినట్లు సమాచారం. అప్పటివరకు విద్యార్థులు అదే నీటిని తాగడానికి, స్నానం చేయడానికి, పళ్లు తోముకోవడానికి, పాత్రలు కడగడానికి ఉపయోగించినట్లు తెలిపారు.
వైద్యం అందిస్తున్న అధికారులు
అస్వస్థతకు గురైన 54 మంది విద్యార్థులను గువాహటిలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి కడుపునొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రణబ్ జ్యోతి బైశ్య తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు విద్యార్థులను తదుపరి వైద్య పరీక్షల కోసం పంపించారు. మిగిలిన విద్యార్థులు చికిత్స అనంతరం తిరిగి వెళ్లారు. ఎవరినీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం రాలేదని, మొత్తం 54 మంది పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.

