బెంగళూరులోని శ్రీరాంపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారనే ఆరోపణలపై ఇందుశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భార్యతో తరచూ గొడవలు, కుటుంబ విషయాల్లో జోక్యం వంటి కారణాలతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారనే ఆరోపణలపై ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఇందుశేఖర్గా గుర్తించారు. బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య సునీతతో సుమారు 20 ఏళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్న అతడికి తరచూ గొడవలు జరిగేవని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భార్య తరచూ పుట్టింటికి వెళ్లడం, ఆమె తల్లిదండ్రులు, సోదరులు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటి కారణాలతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల వివరాల ప్రకారం.. తొలుత భార్య సునీతను గ్రైండింగ్ రాయితో కొట్టి హత్య చేసిన నిందితుడు, ఆమె మృతదేహాన్ని జిల్లాలోని నంది హిల్స్ సమీపంలో పడేశాడు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. మరుసటి రోజు తన బావలు శివకుమార్, శంకర్లను పార్టీకి పిలిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వారి భార్యలు దివ్య, నళిని, అత్త రూపావతి, ఏడేళ్ల బాలుడు పునీత్‌లను కూడా హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.












