ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ప్రశాంతి, భర్త చనిపోతే వచ్చే బీమా డబ్బులతో ఆర్థికంగా లబ్ధి పొందాలని పథకం రచించింది. ఇందుకోసం, రవి పేరున రూ. 66 లక్షల బీమా పాలసీ చేయించింది.
ఈ నెల 2వ తేదీన, ప్రశాంతి తన భర్తకు అధిక మొత్తంలో మద్యం తాగించి, మత్తులో ఉన్న సమయంలో కారుతో ఢీకొట్టి హత్య చేయించింది. అనంతరం, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది.
ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడి భార్య ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా, అనుమానాస్పద మృతిగా భావించి లోతుగా దర్యాప్తు చేయగా, హత్య వెనుక భార్య ప్రశాంతి హస్తం ఉందని తేలింది.
పోలీసులు ప్రశాంతితో పాటు ఈ హత్యలో సహకరించిన మిగతా నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీమా సొమ్ము కోసం జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది.

