విజయవాడలో గడే సాయి కృష్ణ అనుమానాస్పద మరణం, పి. క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్ర విచారణ చేపట్టాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజా రాణిలు కోరారు. ఈ మేరకు వారు NHRC చైర్పర్సన్కు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేశారు. సాయి కృష్ణ మరణం పోలీసు కస్టడీ హింసకు సంబంధించిన అనుమానాలకు తావిస్తోందని, కుటుంబ సభ్యుల ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అరెస్ట్, నిర్బంధం, వైద్య పరీక్షలు, సీసీటీవీ దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలు వంటి అన్ని ఆధారాలను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, పి. క్రాంతి కుమార్ మరణానికి ముందు విడుదలైన వీడియోలో కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తనపై నిరంతరం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన విషయాన్ని ఎంపీలు NHRC దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోతో పాటు, మొబైల్ ఫోన్, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరిచి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
రెండు ఘటనల్లోనూ ఒకే పోలీసు అధికారి పేరు వినిపించడం ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోందని, నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర విచారణ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరపాల్సిన అవసరం ఉందని డాక్టర్ గురుమూర్తి అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.












