మహిళల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ను అందించే కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది.
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వల్ల సంభవించే సర్వైకల్ క్యాన్సర్, మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఈ వైరస్ సోకకముందే, చిన్న వయసులోనే టీకా వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో అధిక ధరలకు లభించే ఈ టీకాను, ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల నుండి 4 లక్షల మంది బాలికలకు ఈ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 14 ఏళ్లు నిండిన బాలికలు ఈ టీకాకు అర్హులు. ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు ధృవీకరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటికే టీకా పంపిణీపై శిక్షణ పూర్తయింది. అర్హులైన బాలికలను గుర్తించి, టీకా వేయించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇంటింటికీ వెళ్లి టీకా వేసేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

