గత కొద్ది వారాలుగా సామాన్యుడిని కలవరపెట్టిన కూరగాయల ధరలు, ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా టమాటా ధర కిలో రూ.10కి పడిపోవడంతో వినియోగదారులకు ఊరట లభించింది. అయితే, ఈ ధరల పతనం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో టమాటా ధర కిలో రూ.10కి చేరడంతో సామాన్యుడికి ఉపశమనం కలిగింది. గతంలో రూ.30-50 వరకు ఉన్న టమాటా ధరలు, దిగుబడి పెరగడంతో గణనీయంగా తగ్గాయని వ్యాపారులు తెలిపారు.
టమాటా తో పాటు, క్యారెట్, బీట్ రూట్ వంటి కూరగాయల ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్లో క్యారెట్ కిలో రూ.20-21, బీట్ రూట్ రూ.15కు లభిస్తుండగా, విజయవాడలో క్యారెట్ రూ.24, బీట్ రూట్ రూ.26కు చేరుకుంది. గతంలో ఈ ధరలు రూ.100 వరకు చేరేవి.
ప్రధాన కూరగాయలైన ఉల్లిపాయలు, బంగాళదుంపలు, సొరకాయ, క్యాబేజీ వంటి వాటి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఉల్లిపాయలు రూ.18, బంగాళదుంపలు రూ.16, సొరకాయలు రూ.15, క్యాబేజీ రూ.12కు లభిస్తున్నాయి. విజయవాడలోనూ ధరలు దాదాపు ఇలానే ఉన్నాయి.
అయితే, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బీన్స్ వంటి కొన్ని కూరగాయల ధరలు మాత్రం ఇంకా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ధరలు తగ్గడం సంతోషాన్నిచ్చినప్పటికీ, పంట పండించిన రైతులకు మాత్రం కనీస పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టమాటా రైతులు కిలో పది రూపాయలకు అమ్మాల్సి రావడంపై ఆందోళన చెందుతున్నారు.

