తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు.
గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రశ్నించారు. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టివే యించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాయలసీమను కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణతో కుమ్మక్కయ్యారని చంద్రశేఖర్ ఆరోపించారు.
తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్ కు కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన చంద్రశేఖర్, ఆ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని, చంద్రబాబుది కేవలం శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్, వైఎస్ జగన్ కృషి కనిపిస్తుందని తెలిపారు.

