సుప్రీంకోర్టు సూచనలతో యూజీసీ (విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్) 2026 ఈక్విటీ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిబంధనలను మరోసారి సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడంతోపాటు ప్రతి విద్యార్థికి సమాన న్యాయం జరిగేలా నిబంధనలను రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
యూజీసీ ఈక్విటీ నిబంధనలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. కొత్త నిబంధనలను మరోసారి పరిశీలించి, ప్రతి విద్యార్థి ప్రయోజనాలు పరిరక్షించేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. భవిష్యత్ తరాలు, యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను రూపొందించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. నిబంధనలను పునఃసమీక్షించేందుకు ఒక కమిటీని నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు ధర్మాసనానికి వివరించారు. ఏ ఒక్క వర్గం విద్యార్థుల్లోనూ అసంతృప్తి, ఆందోళన లేదా అభద్రతాభావం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.












