రాప్తాడు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా జెడ్పీ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై ఓ యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడగా, పాఠశాల ఆవరణలో భయాందోళనలు నెలకొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శనివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న సమయంలో నిందితుడు పాఠశాలలోకి ప్రవేశించి పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా ఈ దాడిలో గాయపడింది. ఈ అనూహ్య ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రేమ పేరుతో వేధింపులే కారణమా
ప్రాథమిక సమాచారం ప్రకారం, ధర్మవరానికి చెందిన హేమంత్ అనే యువకుడు గత కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక అతడి ప్రతిపాదనను తిరస్కరించడంతో కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ దాడికి సంబంధించిన అసలు కారణాలు, నిందితుడికి బాలికతో ఉన్న సంబంధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

