కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. "సూపర్ సిక్స్" పథకాల పేరుతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.
డోన్ పట్టణంలో దశాబ్దాలుగా ఉన్న రైల్వే గేట్ల సమస్య పరిష్కారానికి గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం కృషి చేసిందని, రైల్వే అండర్ పాస్ కు అనుమతి తెచ్చి, పనులు కూడా ప్రారంభించిందని బుగ్గన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనులు అడ్డుకుంటున్నారని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దేవాలయాల అభివృద్ధి పనులు కూడా నిలిపివేశారని, ఇది మంచి ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు.. ఇలా అందరినీ మోసం చేశారని బుగ్గన అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి హెచ్చరించారు.











