అమరావతి, జూన్ 29
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను, కేంద్రమంత్రులను, వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించే అంశంపై చర్చించారు.
ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో నిర్వహించే 31వ సీఐఐ సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. భాగస్వామ్య ప్రధాన సదస్సు కంటే ముందుగా విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించే అంశంపై కూడా చర్చించారు.
విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్రమంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్ను ఆహ్వానించనున్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్లో రోడ్ షోలు నిర్వహిస్తారు.
వ్యవసాయం, ఉద్యాన రంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్ వంటి అంశాలపై చర్చలు జరిగేలా ఎజెండారూపొందించారు. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నామనే దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత వరకు చేసుకోగలుగుతున్నామనేది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అందుకోసమే ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలని ఆదేశించారు.











