విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ, టిక్కెట్ల రీఫండ్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లో రద్దు చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
విమానయాన సంస్థలు టిక్కెట్ బుకింగ్ తర్వాత 48 గంటల్లోపు రద్దు చేసుకునే ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరాదని డీజీసీఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధన టిక్కెట్లలో మార్పులకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
ట్రావెల్ ఏజెంట్లు లేదా వారి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన సందర్భాలలో, రీఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదేనని పేర్కొంది. ఈ మొత్తాన్ని 14 పని దినాలలోగా ప్రయాణికులకు చెల్లించాలని నిర్దేశించింది.
అయితే, దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి ఏడు రోజుల ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు, అంతర్జాతీయ విమానాల్లో 15 రోజుల ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ 'లుక్-ఇన్ ఆప్షన్' వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో టిక్కెట్ రద్దుకు సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.

