ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి, గద్వాల కోర్టులో ఇన్ సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా 226 మంది నుంచి రూ.210 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం.
అనంతపురంలో నివసిస్తూ ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి, అధిక వడ్డీ ఆశ చూపి ఈ మొత్తాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. తిరిగి చెల్లించలేక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక ఆయన గద్వాలలోని చింతలపేట కాలనీలో నివసిస్తున్నట్లు చూపించి కోర్టును ఆశ్రయించారు.
తన వద్ద కేవలం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అప్పులు ఇచ్చిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. బాధితుల ఆస్తుల వివరాలు, శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువపై లోతుగా పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ రంగంలోనూ చర్చనీయాంశమైంది.

