ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై వాట్సాప్ ద్వారానే పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు, చివరి ఐదు లావాదేవీలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ కొత్త సేవలను ప్రారంభించింది.
పీఎఫ్ ఖాతా వివరాలు వాట్సాప్‌లో
పీఎఫ్ బ్యాలెన్స్, ఖాతాలో ప్రస్తుతం ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతా పాస్‌బుక్ సమాచారాన్ని పొందవచ్చు. ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీల వివరాలను పరిశీలించవచ్చు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై)కు సంబంధించిన వ్యక్తిగత మార్గదర్శకత్వం, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు సహాయం పొందవచ్చు. ఈ సేవలతో సాధారణ పీఎఫ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్రియారహిత పీఎఫ్ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్మెంట్
ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన క్రియారహిత పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 వరకు నిల్వ ఉన్న అర్హులైన చందాదారులకు ఆటోమేటిక్ సెటిల్మెంట్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా అర్హులైన ఖాతాదారులు తమ పీఎఫ్ డబ్బులను పొందేందుకు ప్రత్యేకంగా క్లెయిమ్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం ఉండదు.












