కామారెడ్డి, జూలై 20
ఏడు నెలల పసికందును హత్య చేయడానికి కన్నతండ్రే సవతి తల్లితో కలిసి కుట్ర పన్నిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో అసలు నిజాన్ని బయటపెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనలో ఏడు నెలల పసికందును హత్య చేయడానికి కన్నతండ్రే సవతి తల్లితో కలిసి కుట్ర పన్నిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తుతో అసలు నిజాన్ని బయటపెట్టి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి వెల్లడించారు.
బీర్కూర్‌కు చెందిన సంకు సంధ్య తన అక్క శైలజ భర్త టేకు సతీష్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరికి వైష్ణవి అనే కుమార్తె జన్మించింది. అనంతరం దాంపత్య విభేదాల కారణంగా విడిపోయిన ఇద్దరూ, చిన్నారిని తండ్రి వద్దే ఉంచాలని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. అయితే చిన్నారిని పోషించడం భారంగా మారిందనే భావనతో పాటు కుటుంబ విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని సతీష్, శైలజ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
జూలై 14 అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ తీసుకెళ్లి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లారు. అనంతరం గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తీసుకెళ్లిన బ్లేడ్లతో చిన్నారి శరీరంపై పలుచోట్ల గాయాలు చేశారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది.












