దోనకొండ, 2024-06-29
డోన్ లోని గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్ల నుండి గ్యాస్ ను తక్కువ చేసి విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని ఏఐవైఎఫ్ ఆరోపించింది. తక్షణమే ఈ దోపిడీని అరికట్టి, దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించింది.
డోన్ లోని గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి 2 కేజీల వరకు దోచుకుంటున్నాయని, తక్షణమే వాటిపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ (All India Youth Federation) ఆధ్వర్యంలో డోన్ తూనికలు కొలతల అధికారి నాగరాజుకు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్, డోన్ మండల కార్యదర్శి పృథ్వి కుమార్, మండల అధ్యక్షులు హరికృష్ణ, డోన్ పట్టణ సహాయ కార్యదర్శి కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతుంటే, విజయ్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, డెలివరీ బాయ్స్, ఇతర గ్యాస్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. రెండు నెలలు రావాల్సిన గ్యాస్ సిలిండర్లు కనీసం నెల కూడా రావడం లేదని, దీంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.
ప్రజలకు అవగాహన కల్పించి, గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ముందే సిలిండర్లను తూకం వేసి చూపించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తక్షణమే డోన్ లోని విజయ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీలు నిర్వహించి, దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సుబ్బు, కే మనోహర్ పాల్గొన్నారు.












