తాడేపల్లిలో ప్రేమ వ్యవహారంలో యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతుల కుమార్తె మీనాక్షి (డిగ్రీ విద్యార్థిని) తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు రహీం వేధింపులే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, మీనాక్షి, రహీం ఒకే కళాశాలలో చదువుతున్నప్పుడు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో రహీం, మీనాక్షిల సన్నిహిత ఫోటోలు తీశాడు. అయితే, మీనాక్షికి రహీం ప్రవర్తన నచ్చకపోవడంతో అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది.
దీంతో కక్ష పెంచుకున్న రహీం, మీనాక్షిని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని, తనతో రూమ్‌కి రాకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఈ బెదిరింపులతో మీనాక్షి తీవ్ర మనోవేదనకు గురైంది.
కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినప్పటికీ, రహీం వేధింపులు ఆగలేదని, చివరికి ఈ ఘోరానికి పాల్పడిందని తెలుస్తోంది. తల్లిదండ్రులు, తమ్ముడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు మీనాక్షిని ఫ్యాన్‌కు వేలాడుతూ చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన రహీం కోసం గాలిస్తున్నారు.












