చదువుపై ఆసక్తితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈజిప్టుకు చెందిన 11 ఏళ్ల బాలిక మయార్ ఒథ్మాన్ అల్ షోర్బాగీ. ప్రపంచంలోనే అతిపెద్ద పఠన పోటీల్లో ఒకటైన అరబ్ రీడింగ్ ఛాలెంజ్ పదో ఎడిషన్‌లో 4 కోట్ల మంది విద్యార్థులను అధిగమించి విజేతగా నిలిచింది.
దుబాయ్‌లో జరిగిన ఈ పోటీల్లో 60 దేశాలకు చెందిన 4,02,86,428 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరిలో మయార్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమెకు 5 లక్షల యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ.1.2 కోట్లకు పైగా) నగదు బహుమతిగా లభించింది. ఈ పోటీలో భాగంగా మయార్ 60 పుస్తకాలు చదివింది. ఈజిప్టు తరఫున పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకునేందుకు, తన దేశంలోని 1.76 కోట్ల మందికి పైగా విద్యార్థులతో పోటీ పడింది. చివరి దశలో ఎంపికైన ఆరుగురు విద్యార్థుల్లో ఆమె విజేతగా నిలిచింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తన విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని మయార్ తెలిపింది. బహుమతిగా వచ్చిన డబ్బుతో తన పాఠశాలలో లైబ్రరీ నిర్మించడానికి సహాయం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఈజిప్టు సమాచార శాఖ మంత్రిగా ఎదగాలని ఆమె ఆకాంక్షిస్తోంది. అరబిక్ భాషపై తనకున్న ప్రేమను మరింత మందికి పరిచయం చేయాలని కోరుకుంటోంది. రెండో స్థానం: పాలస్తీనాకు చెందిన ఘజల్ రషాద్ తయ్యం 1 లక్ష దిర్హామ్‌లు. మూడో స్థానం: సౌదీ అరేబియాకు చెందిన రయాన్ అల్ జకేరి 70 వేల దిర్హామ్‌లు. ఉత్తమ పాఠశాల అవార్డు: ట్యునీషియాకు చెందిన సిది అమెర్ స్కూల్ 10 లక్షల దిర్హామ్‌లు.












