క్రెడిట్ కార్డు వినియోగమే అంగీకారానికి ఆధారం అని, సంతకం లేకపోయినా కార్డు వాడకమే ఒప్పందానికి నిదర్శనమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందం ఉనికిని నిరూపించే ప్రాథమిక ఆధారాలు ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. కోటక్ మహీంద్రా బ్యాంకుకు, పలువురు క్రెడిట్ కార్డు వినియోగదారులకు మధ్య తలెత్తిన వివాదాలపై దాఖలైన నాలుగు మధ్యవర్తిత్వ దరఖాస్తులను జస్టిస్ అమిత్ బోర్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
బ్యాంకు తరఫున వాదిస్తూ, క్రెడిట్ కార్డు పొందిన వినియోగదారులు కార్డును ఉపయోగించడం ద్వారా కార్డుదారుల ఒప్పందంలోని నిబంధనలను అంగీకరించారని న్యాయస్థానానికి వివరించారు. ఈ ఒప్పందంలోని 32వ నిబంధన ప్రకారం వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, కొందరు వినియోగదారుల క్రెడిట్ కార్డు దరఖాస్తులపై భౌతిక లేదా డిజిటల్ సంతకాలు లేవని, ఎలక్ట్రానిక్ అంగీకారానికి సంబంధించిన అసలు రికార్డులు కూడా అందుబాటులో లేవని కోర్టు దృష్టికి వచ్చింది. సంబంధిత డిజిటల్ రికార్డులు గతంలో సేవలు అందించిన సంస్థ వద్ద ఉన్నాయని బ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సంతకం లేకపోయినా ఒప్పందం చెల్లుబాటు
ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం, మధ్యవర్తిత్వ ఒప్పందం అమలులో ఉండటానికి ప్రతిసారీ భౌతిక సంతకం తప్పనిసరి కాదని పేర్కొంది. మధ్యవర్తిత్వం, రాజీ చట్టం-1996లోని సెక్షన్ 7 ప్రకారం ఒప్పందం రాతపూర్వకంగా ఉన్నట్లు నిరూపించగలిగితే సరిపోతుందని వివరించింది. క్రెడిట్ కార్డు వినియోగం ఒప్పందంలోని నిబంధనలకు అంగీకారంగా పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఒప్పందం ఉనికిని సూచించే ప్రాథమిక ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది.












