2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు గ్రాంట్ల రెండవ విడతను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది. దీని ప్రకారం, ప్రభుత్వం రెండు లక్షల 81 వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు వ్యయం కోసం ప్రతిపాదనలు కోరింది. ఎరువులు, ఆహార సబ్సిడీలు, రక్షణ సేవల వంటి విభాగాలలో పెరిగిన వ్యయాలను భర్తీ చేయడానికి ఈ అదనపు నిధులు ప్రధానంగా అవసరమని పేర్కొన్నారు.
ఈ అదనపు గ్రాంట్ల ప్రతిపాదనలలో 61 గ్రాంట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో తెలిపారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా, వివిధ ఆర్థిక సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంపొందించిందని ఆమె అన్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, భారతదేశం ఆర్థిక షాక్‌లను తట్టుకోవడానికి వీలుగా 57,381 కోట్ల రూపాయలతో 'ఆర్థిక స్థిరీకరణ నిధి'ని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు.
రక్షణ సేవల కోసం 41,430 కోట్ల రూపాయలు, మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ECHS) కోసం 6,140 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రాలు, స్థానిక సంస్థల కోసం 37,886 కోట్ల రూపాయల గ్రాంట్ ఆమోదం పొందింది. రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోకుండా చూడటానికి, ఎరువుల సబ్సిడీల కోసం 19,230 కోట్ల రూపాయలను కేటాయించారు.










