రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, తమకు భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయని వారు ఆరోపించారు.
గత మూడు రోజులుగా రాజంపేట మున్సిపల్ ఆఫీస్ ను టీడీపీ గంజాయి గూండాలు తమ అడ్డాగా మార్చుకున్నారని, అర్హత లేనివారు, రౌడీషీటర్లు, గంజాయి కేసుల్లో ఉన్నవారు గుంపులు గుంపులుగా ఆఫీస్ లోపల, బయట తిష్ట వేశారని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ, పోలీసులు వారిని అడ్డుకోవడం లేదని, పైగా వారికే సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆఫీస్ చుట్టూ కత్తులు, ఇనుప రాడ్లు, రాళ్లు, బీరు బాటిళ్లతో సిద్ధంగా ఉన్నారని, నామినేషన్ కు వచ్చే వైసీపీ అభ్యర్థులను చంపేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ భయానక పరిస్థితుల్లో వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ ఆఫీస్ నుండి బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. మహిళా అభ్యర్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, బయటకు వస్తే బట్టలు చింపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఎన్నికలా లేక ఆడబిడ్డలపై దాడా అని ప్రశ్నించారు.











