YSR Kadapa/Badvel (డాక్సిన్ టైమ్స్) జూలై 01
రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు వాతావరణ మార్పులు సవాల్‌గా మారాయి. ఎల్‌నినో గండం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించడంతో, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక పంట ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రాంతీయ వాతావరణం, నేల స్వభావం ఆధారంగా రైతులకు మార్గదర్శకాలు రూపొందించింది.
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముంగిట నిలిచిన రైతులకు వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అంతటా ‘ఎల్‌నినో’ గండం కమ్ముకునే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాల్లో తీవ్ర అస్థిరత వల్ల సుధీర్ఘ బెట్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు దారి చూపేందుకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రు) నడుం బిగించింది. కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థతో కలిసి, వర్షాభావ ముప్పు ఉన్న మండలాల కోసం ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు పాటించాల్సిన ప్రత్యేక పంట ప్రణాళికలను వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సిద్ధం చేసింది.
ప్రాంతీయ వాతావరణం, నేలల స్వభావం, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ రకాల ఆధారంగా ‘ఎల్‌నినో అండ్ క్రాప్ ప్లానింగ్’ పేరిట ఈ మార్గదర్శకాలు రూపొందించింది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో పాత పద్థతుల్లోనే సాగు చేసి నష్టపోవద్దని, వర్సిటీ సూచించిన అంతర పంటల విధానాలు, తక్కువ కాలపరిమితి గల ప్రత్యామ్నాయ రకాలను ఎంచుకొని ఎల్‌నినో వంటి కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కోవాలని సూచించింది.












