చిన్నమండెం / అన్నమయ్య జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో విస్తరించేందుకు రైతులకు అవగాహన పెంచాలని సూచించారు.
పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై కేశాపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన చేసిన కలెక్టర్, రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా రైతు ఖదర్ నిషా అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్, పంటల పరిస్థితిని పరిశీలించి, సాగు విధానం, నీటి వినియోగం, ఖర్చులు, దిగుబడులపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్కువ నీటితోనూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు. అనంతరం విత్తన పెల్లెటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. విత్తనాలకు సహజ పదార్థాలతో పూత పూయడం వల్ల మొలక శాతం పెరగడం, ప్రారంభ దశలో మొక్కల ఎదుగుదల మెరుగుపడడం, తేమ నిల్వ సామర్థ్యం పెరగడం, వేర్ల అభివృద్ధికి దోహదపడడం వంటి ప్రయోజనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.












