ఉప్పల్ వాయి గ్రామంలో మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ గుడి నిర్మాణాన్ని గ్రామ విడిసి కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్ సంఘం, మాల మహానాడు సంఘం డిమాండ్ చేశాయి. జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ మేరకు తమ డిమాండ్లను వినిపించాయి.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కోత్తోల్ల గంగారం, గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ప్రసన్న మాట్లాడుతూ, ఉప్పల్ వాయి గ్రామంలో ఒకే చోట 8 గుళ్లను నిర్మించాలని గత విడిసి ఆధ్వర్యంలో తీర్మానం జరిగిందని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన విడిసి కమిటీ సభ్యులు కుల వివక్షత చూపుతూ మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ గుడులను ఇక్కడ కట్టొద్దని అంటున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వీడీసీ కమిటీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అన్ని గుళ్లతో పాటు మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ గుడులను కూడా నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. విడీసీ కమిటీ సభ్యుల తీరు రోజురోజుకు మితిమీరుతోందని, వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు కంకణాల రమేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు ధ్యామణి భూపతి, ఆర్టిఐ లేగ్గేలా రాజు, ఎమ్మార్పీఎస్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, ఉప్పల్ వాయి మాల కులగ్రామస్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











