భారత ఓటర్ల జాబితాల సవరణపై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ చేసిన వ్యాఖ్యలను, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తీవ్రంగా ఖండించారు. భారత ఎన్నికల ప్రక్రియ, రాజకీయ వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ అంతర్గత వ్యవహారాల్లో ఆమోదయోగ్యం కాని జోక్యమని ఆయన స్పష్టం చేశారు.
భారత్ బలమైన రాజ్యాంగ సంస్థలు కలిగిన ప్రజాస్వామ్య దేశమని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించిన సుదీర్ఘ చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై అపోహలను తొలగించేందుకు నిర్మాణాత్మక చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
13 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపు వివాదం
భారతీయ మూలాలున్న అమెరికా డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ న సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. భారతదేశంలో ఓటర్ల జాబితాల నుంచి సుమారు 13 కోట్ల మంది పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఓటు హక్కులను ప్రభావితం చేసే చర్యలు చేపడుతోందన్న విమర్శలతో భారతదేశంలోని పరిణామాలను ఆమె పోల్చారు.












