విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు తిరిగి స్వదేశానికి వచ్చి దేశ అభివృద్ధికి తోడ్పడేలా మెరుగైన పరిశోధనా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
జర్మనీలోని బెర్లిన్‌లో భారతీయ శాస్త్ర, సాంకేతిక పరిశోధక విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న ప్రతిభావంతులను భారత్‌కు తిరిగి తీసుకురావడానికి కేవలం అధిక వేతనాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు సరిపోవని గోయల్ అభిప్రాయపడ్డారు. పరిశోధనకు అవసరమైన సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశాలు, ఆవిష్కరణలకు తగిన గుర్తింపు కూడా ముఖ్యమని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యువ పరిశోధకులకు ప్రోత్సాహం
యువ పరిశోధకులు భారత్‌లో పనిచేయడానికి ఎలాంటి సదుపాయాలు అవసరమో తెలుసుకునేందుకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రముఖ పరిశోధనా సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయ ప్రతిభావంతులు స్వదేశానికి తిరిగి వచ్చి పనిచేసేలా ఎలాంటి విధానాలు రూపొందించాలో తమ సూచనలు తెలియజేయాలని పరిశోధకులను కోరారు.












