వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్ఐటీ)లో వార్షిక సాంకేతిక ఉత్సవం టెక్నోజియన్2026 ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, సాంకేతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
ఈ ఉత్సవంలో విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ డస్ట్బిన్లు, రోబోటిక్ డాగ్స్, చిన్న రోబోలు, రాకెట్ నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అత్యవసర వైద్య సేవలు, అగ్నిప్రమాదాల సమయంలో ఉపయోగపడేలా రూపొందించిన రోబోటిక్ నమూనాలు ప్రత్యేకంగా నిలిచాయి. పనికిరాని వస్తువులతో సంగీత పరికరాలను తయారు చేసి, వాటి ద్వారా స్వరాలను వినిపించడం కూడా ఆసక్తి కలిగిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
50కి పైగా కార్యక్రమాలు
టెక్నోజియన్2026లో సుమారు 50 సాంకేతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, డేటా సైన్స్, డ్రోన్ సాంకేతికత, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు సంబంధించిన పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హ్యాకథాన్లు, నమూనాల తయారీ పోటీలు, ప్రయోగాత్మక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు సమాచారం.












