హైదరాబాద్, 27 June
మావోయిస్టు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వామపక్ష నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మావోయిస్టు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, మావోయిస్టులతో సంబంధాలున్నాయని పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. భాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో వివిధ వామపక్ష నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎంతో మంది మావోయిస్టులనే ఆరోపణలతో జైళ్ళలో మగ్గుతున్నారని, కొందరు ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగానే ఉన్నారని సమావేశం ప్రారంభంలో తెలిపారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల డీజీపీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రాలలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిందని ప్రకటించాయి. గత ఎనిమిది నెలల కాలంలో కేంద్ర కమిటీ సభ్యులతో సహా వందలాది మంది మావోయిస్టు కార్యకర్తలు ఉద్యమం వీడి బయటకు రాగా, ప్రభుత్వం వారిని స్వాగతించి ఎటువంటి కేసులు లేకుండా ఇళ్లకు పంపించివేసింది.
అటువంటప్పుడు ఆ మావోయిస్టులకు సహకరించారనే కారణంతో, లేదా ఆ ఉద్యమంలో పని చేశారనే కారణంతో వందలాది సాధారణ కార్యకర్తలను ఇప్పటికీ ప్రభుత్వం జైళ్లలోనే ఉంచటం అన్యాయమని పౌరహక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రానున్న ఆగస్టు 15 సందర్భంగా రాజకీయ ఖైదీల విడుదలపై చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఖైదీలలో కొందరు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇతర రాష్ట్రాలలో కూడా అక్రమ కేసులలో మగ్గుతున్నారని తెలిపారు.











