దేశంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న పన్నుల భారంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టిటి) వంటి అంశాలపై పెట్టుబడిదారుల అభిప్రాయాలను పరిశీలిస్తామని తెలిపారు. అయితే, పన్నులను తగ్గిస్తామని లేదా రద్దు చేస్తామని ఆమె స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
రాబోయే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రారంభమైనందున ఈ అంశంపై ఇప్పుడే తుది నిర్ణయాన్ని వెల్లడించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన సీతారామన్, భారతదేశంలోనే కాకుండా విదేశీ పెట్టుబడిదారులు కూడా మూలధన లాభాల పన్ను విధానంపై చర్చిస్తున్నారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లో లావాదేవీలపై విధించే ఎస్టిటీతో పాటు వివిధ పెట్టుబడి ఆస్తులకు వర్తించే పన్నుల విధానం కూడా చర్చనీయాంశంగా ఉందన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన సన్నాహాలు మొదలైనందున ఈ విషయంపై జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు చేస్తుందనే దానిపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో పన్నుల విధానంపై చర్చకు ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెట్టుబడులు అమెరికా వైపు మళ్లడం, ముఖ్యంగా కృత్రిమ మేధ రంగంలోని భారీ ప్రాజెక్టులకు నిధులు తరలడం కూడా ఈ పరిస్థితికి కారణమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అవి ఇక్కడే కొనసాగేందుకు అనుకూలమైన వ్యాపార వాతావరణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.











