బిహార్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ కలిగిన మిథిలా మఖానా అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ పొందుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక రైతుల కృషితో ఈ సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు చేరుతోంది.
మఖానాను తెలుగులో తామర గింజలతో పోల్చినప్పటికీ, ఇది నీటిలో పెరిగే యూరియేల్ ఫెరాక్స్ అనే మొక్క నుంచి లభించే విత్తనాలతో తయారవుతుంది. వీటిని శుద్ధి చేసి, వేడి చేసి తినడానికి అనువుగా మారుస్తారు. అల్పాహారంగా, ఉపవాస సమయంలో తీసుకునే ఆహారంగా మఖానాకు భారత్‌లో ప్రత్యేక స్థానం ఉంది. బిహార్‌లోని మిథిలా ప్రాంతానికి చెందిన ఈ ఉత్పత్తికి జీఐ గుర్తింపు లభించింది. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ఈ హోదా, దాని ప్రాంతీయ విశిష్టతను గుర్తించడంలో సహాయపడుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎగుమతులతో రైతులకు ప్రయోజనం
మఖానాను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా 2020లో బిహార్ నుంచి ఆస్ట్రేలియాకు తొలిసారిగా సముద్ర మార్గంలో 18 మెట్రిక్ టన్నుల జీఐ గుర్తింపు కలిగిన మిథిలా మఖానాను ఎగుమతి చేసినట్లు పీయూష్ గోయల్ గతంలో వెల్లడించారు. ఈ సరుకును దర్భంగా ప్రాంతంలోని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల వారికి మార్కెట్ ధరతో పోలిస్తే సుమారు 18 శాతం అధిక ఆదాయం లభించిందని తెలిపారు. ఈ ఎగుమతికి వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) సహకరించింది.












