తమిళనాడు పోలీసుల యూనిఫాంలో హిందీ అక్షరాలతో కూడిన బ్యాడ్జిని ధరించాలని బలవంతం చేస్తున్నారనే ఆరోపణలు కలకలం సృష్టించాయి. అయితే, ఈ ఆరోపణలను తమిళనాడు పోలీసు అధికారులు ఖండించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ధరించిన ప్రత్యేక బ్యాడ్జి విషయంలోనే ఈ వివాదం తలెత్తిందని వారు స్పష్టం చేశారు.
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. 1959లో లడఖ్ ప్రాంతంలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన పది మంది కేంద్ర రిజర్వు పోలీసు దళ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజును పాటిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు ధరించిన ప్రత్యేక బ్యాడ్జిపై హిందీ, ఇంగ్లిష్ అక్షరాలు మాత్రమే ఉన్నాయని, తమిళానికి చోటు కల్పించలేదని విమర్శలు వచ్చాయి. ఈ బ్యాడ్జిని యూనిఫాంపై ధరించాల్సిందిగా పోలీసులను బలవంతం చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యేక బ్యాడ్జిపై పోలీసు అధికారుల వివరణ
ఈ వివాదంపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ పోలీసు స్మారక చిహ్నం రూపకల్పన ఆధారంగా ప్రత్యేక జెండా, బ్యాడ్జిని రూపొందించినట్లు తెలిపారు. పోలీసుల వీరత్వం, త్యాగాలను గుర్తుచేసే ఈ చిహ్నాన్ని దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది పోలీసు అమరవీరుల సంస్మరణ దినం రోజున మాత్రమే ధరిస్తారని వివరించారు. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాల హయాంలోనూ ఇదే ప్రత్యేక చిహ్నాన్ని పోలీసులు ధరించారని అధికారులు పేర్కొన్నారు. యూనిఫాంలో హిందీని కొత్తగా ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.












