చెన్నైలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుపై తమిళనాడులో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా చెన్నైలో క్యాంపస్ ఏర్పాటుకు విశ్వవిద్యాలయ మంజూరు సంఘం తుది అనుమతి ఇవ్వడంతో ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. విదేశీ విద్యాసంస్థల రాకతో ఉన్నత విద్య వ్యాపారంగా మారుతుందని, అధిక ఫీజుల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవకాశాలు పరిమితం కావచ్చని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా చెన్నైలోని వేలచేరి ప్రాంతంలో సుమారు 50 వేల చదరపు అడుగుల స్థలంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు విశ్వవిద్యాలయ మంజూరు సంఘం నుంచి తుది అనుమతి లభించింది. తొలుత సమాచార సాంకేతికత, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్ వంటి రంగాల్లో కోర్సులను అందించాలని నిర్ణయించింది. చెన్నై క్యాంపస్ కోసం తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖతో సంస్థ రూ.125 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 200 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విదేశీ విశ్వవిద్యాలయాలపై అభ్యంతరాలు
విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని తమిళనాడు ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర విభాగం వ్యతిరేకిస్తున్నాయి. విద్యారంగంలో ప్రైవేటీకరణ పెరిగి, ఉన్నత విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందన్నది వీరి ప్రధాన వాదన.











