ఆసియా క్రీడలు 2026లో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం భారీ నగదు పురస్కారాన్ని ప్రకటించింది. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.11 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.5.5 లక్షలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.
నాగోయాలో జరిగిన మహిళల హాకీ ఫైనల్లో భారత్ చైనాను 1-0తో స్వల్ప తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్ 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్వర్ణ పతకాన్ని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల తర్వాత భారత్ ఈ విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫైనల్ మ్యాచ్‌లో లాల్రెమ్సియామి 10వ నిమిషంలో చేసిన ఏకైక గోల్ భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత చైనా జట్టు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పటికీ, భారత రక్షణ శ్రేణి గట్టిగా నిలిచింది. గోల్‌కీపర్ సవిత పునియా కీలక సమయంలో పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యాన్ని కాపాడుకోగలిగింది. చివరి వరకు చైనాకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా భారత జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది.











