కామారెడ్డి, జూలై 22
భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డాక్టర్ ఎం. శశికుమార్ హెచ్చరించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల కింద నమోదు, క్లెయిమ్ దరఖాస్తుల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పేరుతో దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డాక్టర్ ఎం. శశికుమార్ సూచించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (TBOCWWB) పథకాల కింద నమోదు, సంక్షేమ క్లెయిమ్ దరఖాస్తుల ప్రక్రియపై ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సంక్షేమ పథకాల క్లెయిమ్ దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దాఖలు చేసే ముందు సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ) కామారెడ్డి లేదా బాన్సువాడ కార్యాలయం నుంచి దరఖాస్తుపై ప్రాథమిక సంతకం తప్పనిసరిగా పొందాలని తెలిపారు. అధికారుల సంతకం లేని దరఖాస్తులను మీసేవలో స్వీకరించరని, అలాంటి క్లెయిమ్లు ఆమోదం పొందవని స్పష్టం చేశారు.
కార్మిక శాఖ సేవలు పూర్తిగా పారదర్శకంగా అందుబాటులో ఉన్నాయని, కార్యాలయ అధికారులు, సిబ్బంది తప్ప ఇతర ప్రైవేటు వ్యక్తులు లేదా మధ్యవర్తులకు ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా లేబర్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని, దళారుల మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని కామారెడ్డి జిల్లా కార్మికులకు డాక్టర్ ఎం. శశికుమార్ విజ్ఞప్తి చేశారు.











