రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, అందుకు అవసరమైన భూ కేటాయింపులు, వివిధ రాష్ట్రాలు అందిస్తున్న రాయితీలను సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ కేటాయింపుల్లో హేతుబద్ధత పాటించాలని ఆయన సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో, ముఖ్యమంత్రి డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై అధికారులతో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న భూ సేకరణపై ఆయన ఆరా తీశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భూ పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, రైతులను సంప్రదించి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూమిపై పెట్టే పెట్టుబడి చాలా స్వల్పమని, కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే పనులు త్వరగా పూర్తవుతాయని ఆయన తెలిపారు.












