వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఎస్సై పుష్పరాజ్ హెచ్చరించారు. రైతులు తమకు కేటాయించిన కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పలు రహదారులపై కొందరు రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. సింగిల్ రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు కళ్లలో పడటంతో ధాన్యం కుప్పలు కనిపించక వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కొంతమంది రైతులు ధాన్యం కుప్పల వద్ద హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయకుండా రాళ్లు, కట్టెలు పెడుతున్నారని, చీకట్లో అవి కనిపించక వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ధాన్యం ఆరబెట్టాల్సి వస్తే దూరం నుంచే కనిపించే హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన, గ్రామీణ రహదారులపై ధాన్యం ఆరబెట్టడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్సై పుష్పరాజ్ స్పష్టం చేశారు. ఇకపై రోడ్లపై ధాన్యం ఆరబెట్టే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు, సొసైటీలు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించి రోడ్డు భద్రతకు సహకరించాలని, రైతుల భద్రతతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై పుష్పరాజ్ కోరారు.












