సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
1. 24 గంటల్లో విచారణ: వెట్టి చాకిరీకి సంబంధించిన ఫిర్యాదులను సాధారణంగా 24 గంటల్లో పరిశీలించాలి. ఆరోపణలు నిర్ధారణ అయితే వెంటనే బాధితులను రక్షించాలి. 2. విడుదల ధ్రువపత్రం: కట్టు బానిసలుగా గుర్తించిన కార్మికులకు సంబంధిత విచారణ అనంతరం సాధారణంగా 24 గంటల్లో విడుదల ధ్రువపత్రం జారీ చేయాలి. 3. ఏడు రోజుల్లో ఆర్థిక సాయం: విడుదల ధ్రువపత్రం జారీ చేసిన ఏడు రోజుల్లోగా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన గుర్తింపు, ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. 4. 90 రోజుల్లో పునరావాస ప్రణాళిక: బాధితులను రక్షించిన 90 రోజుల్లోగా ఒక్కొక్కరికి ప్రత్యేక పునరావాస ప్రణాళిక రూపొందించి అమలు ప్రారంభించాలి. 5. మూడు నెలల్లో మార్గదర్శకాలు: పునరావాస పథకంలో మార్పులు, ఆర్థిక సాయం పెంపు, విధానాల సరళీకరణపై కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. 6. రాష్ట్రాల మధ్య సమన్వయం: ఒక రాష్ట్రంలో కార్మికులను రక్షించి మరో రాష్ట్రానికి పంపినప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి రాష్ట్రం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. 7. బకాయిల చెల్లింపు: ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలు కలిసి సాయం అందని 17 మంది కార్మికుల వివరాలను నెల రోజుల్లో పరిశీలించి, పెండింగ్ మొత్తాలను సాధ్యమైనంత త్వరగా చెల్లించాలి. 8. నిఘా కమిటీల ఏర్పాటు: జిల్లా, ఉపవిభాగ స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి కట్టు బానిసల గుర్తింపు, విముక్తి, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాలి. 9. పిల్లలకు ప్రత్యేక రక్షణ: బాల కార్మికులుగా గుర్తించిన చిన్నారులకు విద్య, వైద్యం, కౌన్సెలింగ్ తదితర సదుపాయాలు కల్పించాలి. 10. అధికారులకు శిక్షణ: పోలీసు అధికారులు, విజిలెన్స్ కమిటీ సభ్యులకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. బాధితులకు రావాల్సిన వేతన బకాయిలను కూడా చట్ట ప్రకారం ఇప్పించాలి. 11. ఏడాది పాటు పర్యవేక్షణ: విడుదలైన కార్మికులు తిరిగి వెట్టి చాకిరీలోకి వెళ్లకుండా కనీసం ఏడాది పాటు వారి పునరావాస పరిస్థితులను జిల్లా విజిలెన్స్ కమిటీలు సమీక్షించాలి. 12. ఆరు నెలల్లో అమలు: కేంద్రం రూపొందించిన సవరించిన ప్రామాణిక విధానాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరు నెలల్లో అమలు చేయాలి. కేంద్రం నాలుగు నెలల్లో సుప్రీంకోర్టుకు అమలు నివేదిక సమర్పించాలి.