ఆదిలాబాద్ రిమ్స్‌లోని నవజాత శిశువుల విభాగంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతిచెందారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్లో మంటలు చెలరేగి, వార్డులో దట్టమైన పొగ వ్యాపించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో 27 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, భద్రతా సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది పలువురు శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే, పొగ పీల్చడం వల్ల, శ్వాస సంబంధిత సమస్యలతో కొందరి పరిస్థితి విషమించింది. తాజాగా మరో ఇద్దరు శిశువులు చికిత్స పొందుతూ మృతిచెందడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం పలువురు చిన్నారులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న ఏడుగురు శిశువులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.











