ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక సారించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత, సురక్షిత తాగునీటి లభ్యతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా మండలి (డీఎల్‌ఏసీ) సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వల నిర్వహణపై ప్రత్యేక సారించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆహార భద్రత నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలను మరింత విస్తృతం చేసి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న, డీపీఓ మురళి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి. విక్రమ్, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












