మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధి, పేద కుటుంబాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, నూతన భవనాలు, విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
కొయ్యగుట్ట తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బాన్సువాడ పట్టణంలోని మూడో వార్డులో మహిళా సమాఖ్య భవనాన్ని, బోర్లం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందించడంతోపాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్సుల నిర్వహణ ద్వారా మహిళా సమాఖ్యలకు ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందిరమ్మ మహిళా క్యాంటీన్ల ద్వారా ఉపాధి కల్పించి ప్రజలకు అందుబాటు ధరల్లో భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.












