ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారని, దాడులు, బెదిరింపులు జరిగాయని పార్టీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నామినేషన్ల దాఖలుకు ఆటంకం కలిగినట్లు ఆధారాలు ఉన్న సందర్భాల్లో మాత్రమే గడువు పొడిగింపును పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులు, వీడియో దృశ్యాలు సహా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి. గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయాన్ని ప్రకటించిన సమయం నుంచి 48 గంటల పాటు అవకాశం కల్పించాలని ధర్మాసనం పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్లపై తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా, దాని ప్రచురణను తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అభ్యర్థులకు అవసరమైన రక్షణ కల్పించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ నిఘా ఉండేలా చూడాలని సూచించింది.











